Share News

ఎల్‌నినో కొనసాగితే జలవిద్యుదుత్పత్తి కష్టమే!

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:12 AM

ఎల్‌నినో ప్రభావం కొనసాగితే రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని, దీనిని అధిగమించేందుకు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో..

ఎల్‌నినో కొనసాగితే జలవిద్యుదుత్పత్తి కష్టమే!

  • థర్మల్‌ కేంద్రాలను గరిష్ఠ సామర్థ్యంతో నడపాలి: విజయానంద్‌

  • జెన్‌కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం కొనసాగితే రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని, దీనిని అధిగమించేందుకు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు. జెన్‌కో అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో హైడల్‌ పవర్‌ ఉత్పత్తిపై రుతుపవనాల మందగమనంతోపాటు తక్కువ వర్షపాతం తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో రోజుకు 25 నుంచి 30 మిలియన్‌ యూనిట్ల వరకు జల విద్యుత్‌ ఉత్పత్తి జరిగిందని, ప్రస్తుతం జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు లేకపోవడంతో రోజుకు కేవలం 5-6 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని చెప్పారు. ‘కృష్ణా పరివాహక ప్రాంతంలోని జలాశయాలకు ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు లేవు. ఎల్‌నినో ప్రభావం కొనసాగితే ప్రస్తుత సీజన్‌లో కృష్ణా బేసిన్‌లో జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి సాధ్యం కాకపోవచ్చు. సీలేరు కాంప్లెక్స్‌లో నీటి నిల్వలు అత్యంత ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తే.. మరో 90-100 రోజుల వరకు ఉత్పత్తికి అవకాశం ఉంది. రిజర్వాయర్ల నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి. పీక్‌ అవర్స్‌లో మాత్రమే జల విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి’ అని స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర విద్యుత్‌ పాధ్రికార సంస్థ అన్ని రాష్ట్రాలకూ ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసిందని.. మన విద్యుత్‌ సంస్థలన్నీ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. జల విద్యుదుత్పత్తి తగ్గనున్న నేపథ్యంలో.. రాష్ట్ర అవసరాలు తీర్చడానికి థర్మల్‌ కేంద్రాల పాత్ర అత్యంత కీలకమవుతుందన్నారు. మరమ్మతులు జరుగుతున్న యూనిట్లు తప్ప మిగిలిన అన్ని థర్మల్‌ యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలన్నారు. మరమ్మతులు పూర్తి త్వరగా పూర్తి ఆ యూనిట్లనూ అందుబాటులోకి తేవాలన్నారు. థర్మల్‌ కేంద్రాల్లో కనీసం 10 రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఎల్లప్పుడూ ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జెన్‌కో ఇన్‌చార్జి ఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్లు సుజయ్‌కుమార్‌, అశోక్‌కుమార్‌రెడ్డి, ఉష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 05:14 AM