వేగంగా బలపడుతున్న ఎల్‌నినో
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:37 AM
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం కింద ఐదు మీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే..
ఊహించిన దాని కంటే ముందే ఎక్కువ తీవ్రత: స్కైమెట్
తిరుపతి, నెల్లూరు, కావలిలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత
రాష్ట్రంలో నేడు భారీ వానలు
విశాఖపట్నం, అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం కింద ఐదు మీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండంతో వచ్చే నెలలో ఎల్‌నినో తీవ్రత వేగవంతమయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఆదివారం వెల్లడించింది. ఎల్‌నినోకు కీలకమైన నినో 3.4 సూచికలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. 2024 ఏప్రిల్ తర్వాత నినో 3.4 ఒక డిగ్రీ వ్యత్యాసాన్ని దాటింది. మూడు వారాలుగా నినో 3.4 సూచికలు ఎక్కువగా ఉంటున్నందున ఇంతకు ముందు ఉహించిన దాని కంటే ముందే ఎక్కువ తీవ్రతతో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్కైమెట్ పేర్కొంది. కాగా హిందూ మహాసముద్రంలో ఎంజేవో, ఐవోడీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జూన్‌లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన వ్యవస్థలు అభివృద్ధి చెందలేదు. అయితే ఈ నెల 21తో ముగిసిన వారానికి హిందూ మహాసముద్రంలో ఐవోడీ రుణాత్మక దశనుంచి తటస్థం వైపునకు వెళ్లింది. దీంతో రుతుపవన కాలం రెండో అర్ధభాగంలో సానుకూలంగా మారుతుందని అంచనా వేసింది. బంగాళాఖాతంపై త్వరలో ఏర్పడనున్న రుతుపవన వ్యవస్థ ప్రభావంతో వచ్చే నెలలో మధ్య, ఉత్తర భారతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చేనెల తొలివారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చునని ఇప్పటికే పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. జూలై తొలివారంలో సీజనల్ ఉపరితల ద్రోణులు బలపడే అవకాశం ఉందని, ఏపీసహా మధ్య, ఉత్తర భారతంలో వర్షాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో మధ్య, ఉత్తర భారతంలో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
ద్రోణుల ప్రభావంతో భారీ వర్షాలు
కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు, కొమరిన్ తీరం నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు వేర్వేరుగా ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు, రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో 6.82, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 5.5, అల్లూరి సీతారామరాజు జిల్లా కృష్ణాపురంలో 5.3, విజయనగరం జిల్లా రాజాంలో 5.25, గుంటూరు జిల్లా కాకుమానులో 5.15, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 5.12, తాడేపల్లిలో 4.52, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 4.15, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో 3.99 సెటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతి, నెల్లూరు, కావలిలో 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల, కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.