Share News

ముందుగానే ఎల్‌నినో

ABN , Publish Date - May 05 , 2026 | 05:41 AM

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థల అంచనా కంటే ముందుగానే పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో రానున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముందుగానే ఎల్‌నినో

  • రుతుపవనాలపై ప్రభావం

  • తక్కువ వర్షాలు.. అధికంగా ఉష్ణోగ్రతలు

  • ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడి

విశాఖపట్నం, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థల అంచనా కంటే ముందుగానే పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో రానున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో భారత ఉపఖండంలో జూన్‌ నుంచి ప్రారంభం కానున్న నైరుతి రుతు పవనాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా ముగిసిందని, ప్రస్తుతం తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఈ నెల నుంచి జూలై మధ్యలో ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ఒకటి తాజాగా పేర్కొంది. ఎల్‌నినో వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రెండు విభాగాల నిపుణుల అంచనాకు అనుగుణంగా ఈ ఏడాది ఎల్‌నినో బలంగా వస్తున్నందున దక్షిణాసియాలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదవుతాయని, దీంతో ఎక్కువ రోజులు వేడి వాతావరణం కొనసాగుతుందని హెచ్చరించింది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో దక్షిణాసియా ఒకటని, రుతుపవనాల్లో హెచ్చుతగ్గుల వల్ల వ్యవసాయం, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు, జల విద్యుత్‌ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - May 05 , 2026 | 05:42 AM