Share News

ద్రోణి ప్రభావంతో రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:38 AM

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ద్రోణి ప్రభావంతో రేపు  కొన్ని జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్‌/కొత్తగూడెం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగుతాయని, తదుపరి నాలుగు రోజుల్లో క్రమేపీ 3-4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. గతంలో మార్చి నెలాఖరుకు 40 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు ఈసారి నెల మధ్యలోనే పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం, నల్లగొండ, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్జ్‌ జారీ చేసింది. కొద్ది రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు రెండు రోజుల నుంచి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

Updated Date - Mar 14 , 2026 | 05:38 AM