Coastal Andhra Fog: కోస్తాలో తీవ్రంగా మంచు
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:36 AM
కోస్తాలోని అనేక ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ మంచు కొనసాగింది.
500 మీటర్ల కంటే తక్కువగా విజిబిలిటీ
బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కోస్తాలోని అనేక ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ మంచు కొనసాగింది. గాలిలో తేమశాతం 90 నుంచి 100 వరకు నమోదైంది. కొన్నిచోట్ల ఉదయంపూట విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోస్తాలో అధికపీడనం కొనసాగడంతో మంచు కురుస్తోందని, మరో నాలుగు రోజులు అల్లూరి జిల్లా, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరుగా మంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఆగ్నేయ, దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో మరింత బలపడనుంది.
గన్నవరంలో దిగలేక హైదరాబాద్‌కు
దట్టమైన పొగమంచు గన్నవరం విమానాశ్రయాన్ని మూసేసింది. దీంతో ఉదయం ల్యాండ్ అవ్వాల్సిన విమానాలను హైదరాబాద్ మళ్లించారు. ఢిల్లీ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరిన ఎయిర్ ఇండియా 2571 విమానం సరైన సమయానికి 8.15కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్‌పోర్టును కమ్మేసిన దట్టమైన పొగమంచుతో పూర్ విజిబులిటీ ఉంది. దీంతో విమానం ల్యాండ్ కావడం అసాధ్యమైంది. గాలిలో ఏడు రౌండ్లు చక్కర్లు కొట్టింది. పరిస్థితి మెరుగుపడకపోవడంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం వచ్చింది. దానిలో 270 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఎయిర్‌పోర్టులో ఒకరి దుర్మరణం
లగేజ్ ట్రాక్టర్ కిందపడి ఎయిరిండియా ఉద్యోగి ఒకరు గన్నవరం విమానాశ్రయంలో దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీకే ఆదిత్య ఆనంద్ (32) కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందినవారు. విమానాశ్రయంలో ఎయిరిండియా సంస్థలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ విభాగంలో పని చేస్తున్నారు. సోమవారం ఉదయం గేర్‌లో ఉన్న లగేజ్ ట్రాక్టర్‌ను నడిపేందుకు సిద్ధం చేస్తుండగా, ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పింది. అక్కడే ఉన్న ఆదిత్య ఆనంద్ ట్రాక్టర్ టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.