Share News

తీరం దాటిన వాయుగుండం

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:05 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి.. రాత్రికి ఒడిశాలో తీరం దాటింది.

తీరం దాటిన వాయుగుండం

  • ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపుగా పయనం.. నేడు కోస్తాలో వర్షాలు

  • కోస్తాంధ్ర ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక

  • తీరం వెంబడి బలమైన గాలులు

  • సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

  • నేడు కోస్తాలో మోస్తరు వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో మొదటి రుతుపవన వాయుగుండం ఆదివారం ఉదయం ఏర్పడి.. రాత్రికి ఒడిశాలో తీరం దాటింది. రెండు రోజుల క్రితం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, శనివారం తీవ్ర అల్పపీడనంగా బలపడిన విషయం తెలిసిందే. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత ఒడిశాలోని బాలాసోర్‌కు సమీపంలో తీరం దాటింది. ఇది ప్రస్తుతానికి బాలాసోర్‌కు సుమారు 50కి.మీ, కియోంఝర్‌గఢ్‌ (ఒడిశా)కు 100 కి.మీ, జంషెడ్‌పూర్‌(జార్ఖండ్‌)కు 140 కి.మీ.దూరంలో ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తుందని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండంతో మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం, అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో రుతుపవన కరెంట్‌ బలంగా ఉందని పేర్కొంటూ కోస్తాంధ్రలో అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతాసూచిక ఎగురవేశారు. ఆదివారం ఉదయం వరకు ఉత్తర కోస్తాలో చిరుజల్లులు కురిసిన తరువాత ఆకాశం మేఘావృతమై ఉంది. రాత్రి నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Updated Date - Jul 06 , 2026 | 05:06 AM