Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో వాయుగుండం
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:14 AM
హిందూమహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.
నేడు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం
10,11 తేదీల్లో సీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు
జనవరిలో వాయుగుండాలు 160 ఏళ్లలో
నాలుగోసారి.. మరోవైపు పెరిగిన చలి
అల్లూరి జిల్లా జి.మాడుగులలో 2.7 డిగ్రీలు
ఈ ఏడాదిలో ఇదే కనిష్ఠ ఉష్ణోగ్రత
విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): హిందూమహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం చెన్నైకు 1220 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా ఉంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనున్నది. ఆ తరువాత 48 గంటలు పశ్చిమ వాయవ్యంగా పయనించి శ్రీలంకలో తీరం దాటి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. ఆ తరువాత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిన తరువాత శ్రీలంకలో తీరం దాటే క్రమంలో తమిళనాడులో వర్షాలు పెరుగుతాయి. దక్షిణ తమిళనాడులో ఈనెల తొమ్మిదో తేదీ నుంచి భారీవర్షాలు కురవనున్నాయి. 10, 11 తేదీల్లో రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 10వ తేదీ నుంచి దక్షిణ కోస్తాలో గాలుల వేగం పెరుగుతుందని పేర్కొంది. ఇదిలావుండగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పుగాలుల ప్రభావంతోనే వాయుగుండంగా బలపడిందని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. చలికాలంలో అందునా జనవరిలో వాయుగుండాలు/తుఫాన్‌లు అరుదుగా వస్తుంటాయన్నా రు. చలికాలంలో సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం, ఇంకా సైబీరియా నుంచి వీచే శీతలగాలుల వల్ల వాయుగుండాలు/తుఫాన్‌లు ఏర్పడానికి అనుకూల వాతావరణం ఉండదన్నారు. వాతావరణ శాఖ వద్ద ఉన్న వివరాల మేరకు గడచిన 160 సంవత్సరాలలో 1926, 1939, 2005 సంవత్సరాల్లో మాత్రమే జనవరి నెలలో బం గాళాఖాతంలో వాయుగుండాలు/తుఫాన్‌లు ఏర్పడ్డాయ ని, మళ్లీ 2026లో వాయుగుండం ఏర్పడిందని గుర్తుచేశారు.
మళ్లీ పెరిగిన చలి
అల్లూరి జిల్లా జి.మాడుగులలో 2.7 డిగ్రీలు
రాష్ట్రంలో గడచిన రెండు రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం దిశగా ఉత్తరాది నుంచి గాలులు వీస్తుండడం, దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో చలి మరికొంచెం పెరుగుతుందని చెప్పారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 2.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. ముంచంగిపుట్టులో 3.5 డిగ్రీలు నమోదైంది.