నేడు పెరగనున్న చలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:21 AM
మధ్యభారతంలో నెలకొన్న అధికపీడనం ప్రభావంతో ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కువచోట్ల శనివారం చలి తీవ్రత కొనసాగింది.
రేపటి నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
విశాఖపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మధ్యభారతంలో నెలకొన్న అధికపీడనం ప్రభావంతో ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కువచోట్ల శనివారం చలి తీవ్రత కొనసాగింది. కోస్తాలో పలుచోట్ల ఉదయం పొగమంచు కురిసింది. ఏజెన్సీలో మంచు ఎక్కువగా నెలకొంది. రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అరకులోయలో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలి ఎక్కువగా ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, కోస్తాలో పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.