Share News

నేడు కోస్తాలో భారీ వర్షాలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:52 AM

ఉపరితల ఆవర్తనాలు, ద్రోణిల ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

నేడు కోస్తాలో భారీ వర్షాలు

  • మత్స్యకారులు సంద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక

  • జూలై తొలివారంలో అల్పపీడనం?

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనాలు, ద్రోణిల ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉభయగోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలతోపాటు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 10, ఏలూరు జిల్లా పెరికిగూడెంలో 9.3, నారాయణపురంలో 8.6, పోలవరం మండలం బుట్టాయగూడెంలో 8.25, కృష్ణా జిల్లా పోతిరెడ్డిపాలెంలో 7.52, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో 7.22, కాకినాడ జిల్లా తొండంగిలో 4.92, విశాఖలోని మహారాణిపేటలో 4.5, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 4 మీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఎక్కువచోట్ల, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఈనెల 30వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, ఆదివారం శ్రీకాకుళం, ఎన్టీఆర్‌, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా, జూలై తొలివారంలో ఒడిశా, కోస్తాంధ్రకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారుతోందని, ఈ క్రమంలో వచ్చే నెల తొలివారంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

Updated Date - Jun 28 , 2026 | 05:53 AM