మరో ఐదు రోజులు మేఘావృతం!
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:48 AM
దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శనివారం కోస్తా జిల్లాల్లో చాలా వరకు ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షాలు పడ్డాయి.
కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అమరావతి/విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శనివారం కోస్తా జిల్లాల్లో చాలా వరకు ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షాలు పడ్డాయి. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 3.62, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 3.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.