బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:33 AM
పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి నైరుతి వైపు ఒంగి ఉంది.
నేటి నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు
తీరం వెంబడి బలమైన గాలులు
మత్స్యకారులు సంద్రంలోకి వెళ్లొద్దని సూచన
రాష్ట్రంపై ప్రభావం తక్కువే: విపత్తుల సంస్థ
అమరావతి, విశాఖపట్నం, జూలై 25(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి నైరుతి వైపు ఒంగి ఉంది. శనివారం సాయంత్రానికి అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో అదే ప్రాంతంలో కదులుతూ బలపడనున్నదని పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి మూడు రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు, ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు, కోస్తా, రాయలసీమల్లోని మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం ఉత్తర ఒడిశా వైపు వచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఏలూరులో ఈనెల 27వ తేదీ నుంచి భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. కాగా, అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై తక్కువగానే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. శనివారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. పడమర దిశ నుంచి వేడిగాలులు వీచాయి. బాపట్లలో 39.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.
జూలైలో మూడో అల్పపీడనం
దీనితో కలిపి జూలైలో మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈనెల తొలివారంలో వచ్చిన అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిశాయి. తర్వాత మూడో వారంలో వచ్చిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తాలో వానలు కురవలేదు. తాజా అల్పపీడనం కూడా పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడడంతో ఉత్తరకోస్తాకు పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు.