బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:46 AM
నైరుతి రుతుపవనాల సీజన్‌లో రెండో అల్పపీడనం బుధవారం ఉదయం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతున్నది
నేడు, రేపు ఉత్తర కోస్తాకు వర్షసూచన
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎండలే!
కొనసాగిన వడగాడ్పులు.. బాపట్లలో 41 డిగ్రీలు
ఖరీఫ్ సీజన్‌పై వర్షాభావం ప్రభావం
విశాఖపట్నం, జూలై 15(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో రెండో అల్పపీడనం బుధవారం ఉదయం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతున్నది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు పయనించనున్నది. ఆతర్వాత మరో మూడు నాలుగు రోజులకు ఝార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పయనించనున్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు పుంజుకుని తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. అదే సమయంలో రానున్న ఆరేడు రోజుల వరకు దక్షిణ, పశ్చిమ భారతంలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుందని తెలిపింది. కాగా అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. కాగా, బుధవారం కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు కొనసాగాయి. బాపట్లలో 41.1, జంగమహేశ్వరపురంలో 41, తిరుపతిలో 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రెండు వారాలు వర్షాభావం కొనసాగడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మరో ఆరేడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.