12 తర్వాత అల్పపీడనం
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:49 AM
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి ఈశాన్యంగా దిశ మార్చుకుని క్రమేపీ బలహీనపడనుంది.
విశాఖపట్నం, అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి ఈశాన్యంగా దిశ మార్చుకుని క్రమేపీ బలహీనపడనుంది. ఆ తర్వాత బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో ఈనెల 12వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ ప్రభావంతో ఉత్తరకోస్తా, దానికి ఆనుకుని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో వర్షాలు పెరుగుతాయని తెలిపారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం పొడి వాతావరణం ఏర్పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరులో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆతర్వాత ఎండలు కొనసాగుతాయని పేర్కొంది.