నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:10 AM
పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ ప్రాంతం, దానికి ఆనుకుని బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ ప్రాంతం, దానికి ఆనుకుని బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా ఉత్తర ఛత్తీ్‌సగఢ్ వైపు పయనించనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే క్రమంలో అల్పపీడనం ఉత్తర ఒడిశా పరిసరాల్లో నిలకడగా ఉంటే ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన డాల్ఫిన్ టైపూన్ దక్షిణ చైనా సముద్రం వైపు వచ్చిందని, ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా మారతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో శుక్రవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. కాగా, అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పోలవరం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.