Share News

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:14 AM

బంగాళాఖాతంలో అల్పపీడనాల పరంపరం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన..

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

  • దేశవ్యాప్తంగా చురుగ్గా రుతుపవనాలు

విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనాల పరంపరం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో తూర్పు, మధ్య, ఉత్తరభారతంలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. దీని ప్రభావంతో ఆదివారం నుంచి దేశంలో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు అనేకచోట్ల అతిభారీ నుంచి అసాధారణ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం మధ్యభారతం మీదుగా పయనించే క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఈ నెల 18 వరకు వర్షాలు కురుస్తాయి. ఈశాన్య భారతంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షాలు పెరగనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్నిప్రాంతాల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు పుంజుకుని వర్షాలు కురుస్తున్నప్పటికీ... దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాలో మాత్రం వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

అల్పపీడనం వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన జాలర్లు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. అల్పపీడనం నేపథ్యంలో సోమవారం... శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని, మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

Updated Date - Aug 17 , 2026 | 05:14 AM