రుతుపవనాలపై ‘బావి తుఫాన్’ ప్రభావం
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:12 AM
చైనాలో ఏర్పడిన ‘బావి’ తుఫాను భారతదేశంలో రుతుపవనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అత్యంత శక్తివంతమైన ఈ తుఫాను పసిఫిక్ మహాసముద్రం నుంచి..
దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లిన రుతుపవన గాలులు
భారతదేశంపైకి తేమగాలులు రాకుండా అవరోధం
17న అల్పపీడనం: స్కైమెట్
విశాఖపట్నం, జూలై 12(ఆంధ్రజ్యోతి): చైనాలో ఏర్పడిన ‘బావి’ తుఫాను భారతదేశంలో రుతుపవనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అత్యంత శక్తివంతమైన ఈ తుఫాను పసిఫిక్ మహాసముద్రం నుంచి భారత ఉపఖండంవైపు రావాల్సిన రుతుపవనాల గాలులను తనవైపు తీసుకుపోయింది. దీంతో ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలోని బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడానికి అనువైన వాతావరణం లేకుండా పోయింది. దీని ఫలితంగా బంగాళాఖాతం బలహీనంగా మారింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 2వ తేదీన అల్పపీడనం ఏర్పడినా... ఆ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడడాన్ని ‘బావి తుఫాన్’ బలంగా అడ్డుకుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ బలంగా మారి రుతుపవన ప్రవాహం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం దిశగా వెళ్లేందుకు బలమైన ఎల్‌నినో ప్రభావం కూడా తోడైందని పేర్కొన్నారు. ఫలితంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు తేమగాలులు వెళ్లకుండా అవరోధం ఏర్పడిందన్నారు. రుతుపవన గాలులు దక్షిణ చైనా సముద్ర తీరం దిశగా వెళ్లినప్పుడు భారత ఉపఖండంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భాలు ఉన్నాయని వాతావరణ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. బావి తుఫాన్ ఈనెల ఆరో తేదీన చైనాలో తీరం దాటి బలహీనపడిందని, దీంతో రుతుపవనగాలుల ప్రవాహం భారతవైపు రావడానికి వాతావరణం అనుకూలంగా మారనున్నదని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ కల్లా వాయవ్య బంగాళాఖాతంలో ఉపరిల ఆవర్తనం ఏర్పడి, 16 లేదా 17న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనావేశారు.