రాష్ట్రంలో రెండో వేసవి
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:50 AM
మేఘాల జాడ లేదు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు
తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్న పంటలు
ఆగస్టు ముగుస్తున్నా పూర్తికాని వరి నాట్లు
నెలాఖరు వరకు అంతంత మాత్రంగానే వర్షాలు
విశాఖపట్నం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మేఘాల జాడ లేదు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం కావలిలో 39.1, నెల్లూరులో 38.9, బాపట్లలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అడపాదడపా తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. అవి కూడా ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి కారణంగానే తప్ప, రుతుపవనాల ప్రభావంతో కాదని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. దీంతో ఖరీఫ్ పంటలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చాలాచోట్ల పంటలు ఎండిపోయాయి. ఆగస్టు నెలాఖరు వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తికాలేదు.
అల్పపీడనాల ప్రభావం లేదు!
బంగాళాఖాతం ముఖద్వారంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు తూర్పు భారతం మీదుగా మధ్య భారతం వైపు వెళుతుండంతో వాటి ప్రభావం కోస్తాంధ్ర, చివరకు ఉత్తరాంధ్రపై కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఇంకా పశ్చిమబెంగాల్‌ను ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వాటి ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తుండగా, ఈనెల 26వ తేదీ తరువాత అల్పపీడనం వస్తుందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. గురువారం నుంచి ఈనెల 26 వరకు గల వారం, 27 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు గల వారంలో మధ్య, తూర్పు, ఉత్తరాదిలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని, ఏపీలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రెండు వారాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం వరకు చూస్తే ఆగస్టు చివరి రోజుల్లో వర్షాభావమే కొనసాగుతుందని, అందువల్ల కరువు ప్రభావం నెలకొంటుందని ఇస్రో వాతావరణ నిపుణుడు వివరించారు. ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి నెలకొని రానున్న రెండు, మూడు రోజులు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.