రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి
ABN , Publish Date - May 06 , 2026 | 04:45 AM
రాష్ట్రంలో మంగళవారం 9 జిల్లాల పరిధిలోని 45 మండలాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఓవైపు ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షాలు
అమరావతి, విశాఖపట్నం, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళవారం 9 జిల్లాల పరిధిలోని 45 మండలాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉక్కపోత, ఎండ తీవ్రత ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా హరిపురంలో 73, కొర్లాంలో 61.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు అక్కడక్కడా వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం ఉత్తర కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
12న బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండోవారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నది. దీని ప్రభావంతో ఈ నెల 11 లేదా 12వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నదని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.