బయట భగభగ.. ఇంట్లో కుతకుత
ABN , Publish Date - May 26 , 2026 | 03:48 AM
రాష్ట్రంలో ఎండ, వడగాడ్పుల తీవ్రత తగ్గడం లేదు. సోమవారం కూడా కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాలు నిప్పులకొలిమిలా మారాయి. వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మరణించారు.
కోస్తా నిప్పులకొలిమి
బెజవాడలో 48.1 డిగ్రీలు
115 మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
వడదెబ్బకు 15 మంది మృతి
రుతుపవనాలు మరింత ఆలస్యం
భానుడి భగభగలకు అనధికార విద్యుత్ కోతల సెగలు కూడా తోడవడంతో రాష్ట్రం అల్లాడిపోతోంది. రోళ్లు పగిలే కార్తెకు భయపడి జనం ఇల్లు దాటడం లేదు. సోమవారం విజయవాడలోని పెనమలూరులో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 48.1 డిగ్రీలను తాకాయి. దీంతో కాలు బయటపెట్టడానికే ప్రజలు జంకుతున్నారు. ఇప్పుడువారికి విద్యుత్ కోతలు మరింత నరకం చూపిస్తున్నాయి. బయట వేడిగాలులు.. ఇంట్లో ఉక్కపోతతో జనం సతమతమై పోతున్నారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఎండ, వడగాడ్పుల తీవ్రత తగ్గడం లేదు. సోమవారం కూడా కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాలు నిప్పులకొలిమిలా మారాయి. వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మరణించారు. కోస్తాలో 14 జిల్లాల్లోని 115 మండలాల్లో 44 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులకు ప్రజలు ఠారెత్తిపోయారు.
కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరుల్లో అత్యధికంగా 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 46.3, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 46.1, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 45.7, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4, కోనసీమ జిల్లా శివల, కాకినాడ జిల్లా కాజులూరుల్లో 45.2, గుంటూరు జిల్లా మంగళగిరిలో 44.9, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7, విశాఖ జిల్లా ములగాడలో 44.4, తూర్పుగోదావరి జిల్లా పోతవరంలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు ఎన్టీఆర్ జిల్లాలో ముగ్గురు, గుంటూరు, తిరుపతి, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విజయనగరం, ప్రకాశం, మార్కాపురం, అనకాపల్లి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఎండ తీవ్రతకు విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజపురం గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో 5 వేల కోడిపిల్లలు చనిపోయాయి. కాగా, అల్పపీడన ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. కాగా, రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యం అవకాశం ఉంది...
రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతను ఈ మ్యాప్ ప్రతిబింబిస్తోంది. పోలవరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో పూర్తిగా, కాకినాడ, కోనసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన ఎరుపు రంగులో కనిపిస్తున్న భాగమంతా అతి భారీ ఉష్ణోగ్రతలు(48 డిగ్రీలు) నమోదయ్యాయి. నారింజ రంగులో ఉన్న కడప, నంద్యాల, కర్నూలు, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. అయితే, ఆయా జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆకుపచ్చ రంగులో ఉన్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.