48 గంటల్లో అల్పపీడనం 4 రోజులు వర్షాలు
ABN , Publish Date - May 11 , 2026 | 03:49 AM
బిహార్ నుంచి ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.
పలు మండలాల్లో కొనసాగనున్న వడగాడ్పులు
అమరావతి/విశాఖపట్నం, మే 10(ఆంధ్రజ్యోతి): బిహార్ నుంచి ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42, పల్నాడు జిల్లా గురజాలలో 41.6, కర్నూలు జిల్లా నగరడోనలో 41.3, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41.1, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఎక్కువ ప్రాంత ాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఆ తర్వాత బలపడి తమిళనాడు సమీపంగా రానుందని, దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత రెండు రోజుల్లో బలహీనపడుతుందని, ఈనెల 17వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని పలు మోడళ్లు అంచనా వేస్తున్నాయి. కాగా, అల్పపీడనం ప్రభావంతో రానున్న 4 రోజులు కోస్తా, సీమలో ఆకాశం మేఘావృతమై, కొన్ని ప్రాంతా ల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.