Share News

ఇటు ఎండ.. అటు వాన

ABN , Publish Date - Jun 10 , 2026 | 06:01 AM

రాష్ట్రంలో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మంగళవారం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో నెల్లూరు..

ఇటు ఎండ.. అటు వాన

  • మాకవరపాలెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

  • తుని, అన్నవరంలో ఈదురుగాలుల బీభత్సం

  • నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

  • నేడు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌):

రాష్ట్రంలో ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మంగళవారం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండ ఎక్కువగా ఉంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4, మన్యం జిల్లా భామినిలో 42.2, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ, ఉక్కపోతతో వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట, గవరపేట ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడి తోటల్లో భారీగా కాయలు నేలరాలిపోయాయి. అన్నవరంలోనూ ఈదురుగాలుల వీచాయి. గ్రామశివారు కొత్తపేటలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. జూతీయ రహదారిపై ఉన్న సత్యదేవుడి నమూనా ఆలయం వద్ద మరుగుదొడ్లు, ఇతర నిర్మాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. గ్రామంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా, రానున్న 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని, కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని పలుచోట్లకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. బుధవారం అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో 41-42, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40-41, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది.

Updated Date - Jun 10 , 2026 | 07:11 AM