ఇక్కడ ఎండ.. అక్కడ వాన
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:52 AM
కోస్తాంధ్ర, దానికి ఆనుకుని తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు బంగాళాఖాతంలో ఉన్న అధికపీడనం వల్ల వాతావరణ అనిశ్చితి నెలకొంది.
నేడు తీవ్ర వడగాడ్పులు: విపత్తుల సంస్థ
విశాఖపట్నం/అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్ర, దానికి ఆనుకుని తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు బంగాళాఖాతంలో ఉన్న అధికపీడనం వల్ల వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో మంగళవారం ఏజెన్సీ ప్రాంతంలో పిడుగులు, ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో వడగళ్లు పడ్డాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.9, అనంతపురం జిల్లా భట్టువానిపాలెంలో 40.5, విజయనగరం జిల్లా గుర్లలో 39.9, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 39.8, శ్రీకాకుళం జిల్లా గంగువారిసింగడంలో 39.6, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 39.5, చిత్తూరు జిల్లా రాయలపేటలో 39.2, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, విజయనగరం, మన్యం జిల్లాల్లోని 8 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.