ఠారెత్తించిన ఎండ.. దంచికొట్టిన వాన!
ABN , Publish Date - May 04 , 2026 | 03:53 AM
మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం అనేకచోట్ల ఎండలు ఠారెత్తించగా.. పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో భిన్న వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో భిన్న వాతావరణం
పలు జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం
ముమ్మిడివరంలో 7.2 సెం.మీ. నమోదు
దక్షిణ కోస్తా, సీమలో వడగాడ్పులు
గూడూరులో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
రేపు, ఎల్లుండి ఉత్తరకోస్తాకు భారీ వర్షసూచన
విశాఖపట్నం, అమరావతి, పర్చూరు, నెల్లూరు(హరనాథపురం): మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం అనేకచోట్ల ఎండలు ఠారెత్తించగా.. పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో భిన్న వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 7.2 సెంటీమీటర్లు, కాట్రేనికోనలో 5.7, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 5, పిఠాపురంలో 4.5 సెంటీమీరట్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వడగాడ్పులు, మిగిలినచోట్ల వేడి వాతావరణం కొనసాగింది. ఈ వేసవిలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లా గూడూరులో ఆదివారం 46.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు, బల్లికురవలో 46.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులు, పిడుగులతో వర్షం కురుస్తుదని, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఐదు, ఆరో తేదీల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
గాలివాన బీభత్సం
బాపట్ల జిల్లా పర్చూరులో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పెనుగాలులకు 40 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి దెబ్బతింది. పర్చూరు మండలం దేవరపల్లి సమీప కల్లాల్లో ఎండబెట్టిన ఆరు ఎకరాల మిర్చికాయలు వర్షానికి తడిచిపోయాయి. అక్కడక్కడా కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న విత్తనాలు సైతం అకాల వర్షానికి తడిచిపోయాయి. నెల్లూరు నగరంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ అంతరాయంతో పలు వీధులు అంధకారంతో మునిగాయి. రోజంతా భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. మర్రిపాడు మండలంలోని చిన్నమాచునూరు, కలికిరి మండలం కుమ్మరకొండూరులో ఈదురు గాలులకు ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. చిన్నమాచునూరులో వేపచెట్టు నేలకొరిగింది. కరెంట్ స్తంభం ఒరిగి ట్రాక్టర్‌పై పడింది. ఆత్మకూరులో తోటల్లో మామిడి కాయలు రాలడంతో యజమానులు ఆందోళన చెందారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఒంగోలు అతలాకుతలం భీకరగాలులతో విరిగిన చెట్లు
ఒంగోలు/మార్కాపురం మే 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం రాత్రి పెనుగాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం వరకూ ఎండ మండింది. దాదాపు సగం మండలాల్లో 42 నుంచి 45.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారింది. గాలీ వర్షానికి పలు ప్రాంతాల్లో పెద్దపెద్ద చెట్లు విరిగి పడ్డాయి. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌లో బెలూన్‌పై పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అది కూలిపోయింది. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు గాలుల తీవ్రతతో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఒంగోలు సహా, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా లేక, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షంతో ప్రజానీకం అవస్థలు పడ్డారు. పలుచోట్ల హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు గాలుల తీవ్రతకు పడిపోయాయి. కంభంలో కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రేకులషెడ్లపై ఉన్న పైకప్పులు ఎగిరిపోయాయి.