పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:04 AM
ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తరాంధ్ర, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి విస్తరించింది.
శ్రీకాకుళం జిల్లాలో నేలకూలిన వృక్షాలు
నేడు, రేపూ వర్ష సూచన
విశాఖపట్నం, అమరావతి, శ్రీకాకుళం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తరాంధ్ర, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో శుక్రవారం కోస్తాలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖ నగరంలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో భారీగా పిడుగులు పడ్డాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా విశాఖ నగరంలో వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా వేచలంలో 40, పార్వతీపురం మన్యం జిల్లా పెదమేరంగిలో 34 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి, ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం కర్నూలులో 36.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహ ణ సంస్థ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నం ద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదివారం విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కంచిలి మండలంలో అత్యధికంగా 22.5 మి.మీలు నమోదైంది. ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు పడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వడగళ్ల వాన, బలమైనగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కరెంటు తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, జిల్లా కేంద్రంతో పాటు చాలా పల్లెలు అంధకారంలో మగ్గిపోయాయి. మరోవైపు ఈ అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వడగళ్ల దెబ్బకు మామిడి, జీడిమామిడి, అరటి వంటి ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది.