Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:07 AM

బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే వాతావరణం నెలకొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

  • నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన

  • వచ్చే పది రోజుల్లో మరో రెండు అల్పపీడనాలు

విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే వాతావరణం నెలకొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్యంగా పయనించి సోమవారం నాటికి ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మీదుగా పయనించనుంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. సోమవారం ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల భారీగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఈ నెల 27 లేదా 28 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు పలు వాతావరణ మోడళ్లు విశ్లేషించాయి. వచ్చే నెల మూడో తేదీలోగా మరొక అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో కురిసే వర్షాలు ఖరీఫ్‌ పంటలకు కొంత మేలు చేస్తాయన్నారు. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వర్షాధార పంటలకు జీవం పోసినట్లవుతుందన్నారు. ఈ నెల 27వ తేదీన ఏర్పడనున్న అల్పపీడనం వల్ల ఉత్తరకోస్తాకు కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉందని అంచనావేశారు.

Updated Date - Aug 24 , 2026 | 06:33 AM