Share News

ఎండ.. వాన

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:59 AM

రాష్ట్రంలో మంగళవారం ఒకపక్క ఎండలు, మరోపక్క వర్షాలతో భిన్నమైన వాతావరణం నెలకొంది. వాయవ్య గాలులతో కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

ఎండ.. వాన

  • రాష్ట్రంలో విభిన్న వాతావరణం

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళవారం ఒకపక్క ఎండలు, మరోపక్క వర్షాలతో భిన్నమైన వాతావరణం నెలకొంది. వాయవ్య గాలులతో కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. 288 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 44.4, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం 210 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదిలావుండగా ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీవర్షం పడింది. ఈ నెలాఖరు వరకు ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే వాతావరణ అనిశ్చితి కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


మన్యంలో భారీవర్షం

పాడేరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మన్యంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉంది. ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. ఉదయం నుంచి ఎండకు అల్లాడిన జనం.. వర్షంతో ఊరట చెందారు.

Updated Date - Apr 22 , 2026 | 06:01 AM