ఇటు ఎండ.. అటు వాన
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:44 AM
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
నంద్యాలలో 39.6 డిగ్రీలు.. చింతపల్లిలో 5.5 సెం.మీ. వర్షపాతం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 39.6, కర్నూలులో 39.4, జంగమహేశ్వరపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కృష్ణాపురంలో 5.55, మార్కాపురం జిల్లా మేడపిలో 5.4, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 4.7, పల్నాడు జిల్లా మాగుడులలో 4, విజయనగరం జిల్లా గుర్లలో 3.37, విశాఖ జిల్లా పద్మనాభంలో 3.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో పిడుగు పడి వ్యవసాయ కూలీ గుడిపాటి చిన్న కోటేశ్వరావు (29) మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. అలాగే, తిమ్మాయిపాలెం రోడ్డులోని నాగమయ్య పుట్ట వద్ద పిడుగు పడి 10 గొర్రెలు చనిపోయాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని, కోస్తాలో కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.