సగం మండలాల్లో వర్షాభావం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:45 AM
నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్‌లో తొలి మాసమైన జూన్‌లో రాష్ట్రంలో దాదాపు సగం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
జూన్‌లో 23.6 శాతం లోటు.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సగటు కంటే తక్కువే
దేశంలో 42 శాతం తక్కువ వర్షపాతం నమోదు
విశాఖపట్నం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్‌లో తొలి మాసమైన జూన్‌లో రాష్ట్రంలో దాదాపు సగం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో 94.6 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, 72.3 మి.మీ. మాత్రమే(సాధారణం కంటే 23.6 శాతం తక్కువ) నమోదైంది. రాష్ట్రంలో 28 జిల్లాలకుగాను 14 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. మరో 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, రెండు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు పవేశించిన తర్వాత కొద్దిరోజులు స్థిరంగా ఉండిపోయాయి. ఆ తరువాత నెమ్మదిగా కదులుతూ 15వ తేదీకల్లా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అయినా బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఎండలు మండిపోతున్నాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అడపాదడపా వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. జూన్ నెల ముగుస్తున్నప్పటికీ బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతోంది. కోస్తాలో అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, మిగిలిన తొమ్మిది జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 52.5 శాతం లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొంది. దక్షిణ కోస్తాలో ప్రకాశం జిల్లాలోనే లోటు వర్షపాతం నమోదైంది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో తొలకరి పనులకు కొంతమేర అవకాశం ఏర్పడింది.
రాయలసీమలో చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 688 మండలాలు ఉండగా, 46 మండలాల్లో చాలా ఎక్కువగా, 100 మండలాల్లో ఎక్కువగా, 157 మండలాల్లో సాధారణంగా, 249 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా, 136 మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్నమయ్య, తిరుపతి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నెలలో కురవాల్సిన వర్షంలో 50 శాతం కంటే తక్కువ నమోదవడంతో తొలకరి పనులకు తీవ్ర అవరోధం ఏర్పడింది. అయితే, జూలై తొలివారంలో వర్షాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పొడిరోజుల కాలం ఎక్కువగా ఉంటుందని, ఇది ఖరీఫ్ పంటలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలావుండగా దేశంలో జూన్‌లో 157.7 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, సోమవారం వరకు 92.2 (42శాతం తక్కువ) మి.మీ. నమోదైంది. వాయవ్య భారతంలోని పలు రాష్ట్రాలకు ఇంకా రుతుపవనాలు విస్తరించలేదు. దేశంలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు మరో వారం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు.
నేడు ఉత్తర కోస్తాలో వర్షాలు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది.