Share News

అక్కరకురాని అల్పపీడనాలు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:13 AM

వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఏర్పడిన రెండో అల్పపీడనం కూడా నిరాశపరిచింది.

అక్కరకురాని అల్పపీడనాలు!

  • తాజాగా తూర్పు భారతం వైపు పయనం.. ఉత్తరకోస్తాకు మోస్తరు వర్షాలు?

  • రాష్ట్రంలో 50.4 శాతం లోటు వర్షపాతం.. కొన్ని జిల్లాల్లో మరింత ఆందోళనకరం

విశాఖపట్నం, అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఏర్పడిన రెండో అల్పపీడనం కూడా నిరాశపరిచింది. బుధవారం ఉత్తర వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది వాయవ్యం దిశగా పయనించి ఝార్ఖండ్‌ వైపు వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు, పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలోని మిగిలినచోట్ల శుక్రవారం చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారానికి తీవ్ర అల్పపీడనం తూర్పుభారతం మీదుగా ఉత్తర భారతం వైపు పయనించే అవకాశం ఉందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేశాయి. అందువల్ల రాష్ట్రంలో శనివారం నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొన్నాయి. ఈ నెల మొదటి వారంలో ఉత్తర ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా మీదుగా పయనించడంతో ఉత్తరకోస్తా వరకే వర్షాలు పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వర్షాలు ముఖం చాటేశాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తుండటంతో పొడి వాతావరణం నెలకొని ఖరీఫ్‌ పంటల సాగుకు అవరోధం ఏర్పడింది. తాజాగా ఏర్పడిన అల్పపీడనంతోనైనా వర్షాలు బాగా కురుస్తాయని రైతులు ఆశపడ్డారు. ఇది కూడా నిరాశపరిచింది. అల్పపీడనం ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు పరిమితమైంది. తీవ్ర అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తూర్పు భారతం వైపు పయనించే క్రమంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లలో వర్షాలు కురుస్తాయని, దీంతో గోదావరి, వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాలకు వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతే తప్ప రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపదని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.


ఏ జిల్లాలోనూ సానుకూల వర్షాల్లేవ్‌!

నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభమై 46 రోజులు పూర్తయ్యింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 174.3 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. 86.5 మి.మీ. మాత్రమే(సాధారణం కంటే 50.4 శాతం తక్కువ) నమోదైంది. 28 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదుకాకపోవడంతో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణం కంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 69.8 శాతం, అన్నమయ్య జిల్లాలో 67.4, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 66.4, తూర్పుగోదావరి జిల్లాలో 64.3, కడపలో 60.6 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 670 మండలాల్లో సుమారు 100 మండలాలు తప్ప మిగిలినచోట్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావం ఇలాగే కొనసాగితే కరువు తప్పదని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ఐఎండీ తెలిపింది. మధ్య, తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

నేడు ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, అలూరి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో మోసరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Updated Date - Jul 17 , 2026 | 04:15 AM