Share News

‘ఎల్‌నినో’ని ఎదుర్కొందాం!

ABN , Publish Date - May 11 , 2026 | 04:57 AM

ఈ ఏడాది నైరుతి రుతుపవన సమయంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

‘ఎల్‌నినో’ని ఎదుర్కొందాం!

  • ‘నైరుతి’లో 15-25శాతం వానలోటు!

  • ‘ప్రత్యామ్నాయ’ సాగుపై వ్యవసాయ, ఉద్యానశాఖల సమాయత్తం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది నైరుతి రుతుపవన సమయంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఐఎండీ అంచనాల మేరకు ఈ రుతుపవన సమయంలో వర్షపాతం దీర్ఘకాల సగటు లో 92శాతం(5శాతం అటుఇటుగా 87 సెంటీమీటర్లు) ఉండొ చ్చు. దీన్ని బట్టి జూన్‌లో 15శాతం, జూలైలో 17శాతం, ఆగస్టులో 29శాతం, సెప్టెంబరులో 21శాతం, అక్టోబరులో 25శాతం సగటున వాన లోటు ఉంటుందని అంచనా. నైరుతి రుతుపవన కాలంలో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా. అలాగే ఎల్‌నినో ప్రభా వం కరువు పీడిత, వర్షాధార జిల్లాలపై కేంద్రీకృతమౌతుందని వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు అంచనా వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావంతో వాన లోటు ఎక్కువగా కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ రుతుపవన సమయంలో ప్రీ మాన్సూన్‌ డ్రై స్పెల్‌(పీఎండీఎస్‌) విధానంలో గుళికల పద్ధతిలో విత్తనాలు నాటి, సాగును ముమ్మరం చేయడం ద్వారా 18 లక్షల మంది రైతులతో 20లక్షల ఎకరాల్లో పంటలు వేయించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు పర్యవేక్షణలో జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు రైతు సేవా కేంద్రం సహాయకులు, సామాజిక సహజ సేద్య క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్స్‌ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఇందుకోసం వర్షాభావ ప్రాంతాల్లో 15కిలోలు బరువు ఉండే 25-30 రకాల విత్తన కిట్లను రైతులకు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

Updated Date - May 11 , 2026 | 04:58 AM