ఎండ భగభగ
ABN , Publish Date - May 27 , 2026 | 05:24 AM
రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఎండ, వడగాడ్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
ములుకుదురులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత
125 మండలాల్లో 44 డిగ్రీలకుపైనే నమోదు
వడదెబ్బకు మరో 11 మంది మృతి
పిడుగురాళ్లలో పార్కింగ్ చేసిన కారు దగ్ధం
వాతావరణ అనిశ్చితితో పలుచోట్ల గాలివాన
నెలాఖరు వరకు వడగాడ్పులు
జూన్ తొలి వారంలో అల్పపీడనం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఎండ, వడగాడ్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. రాష్ట్రంలోని 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 116 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7, పల్నాడు జిల్లా గురజాలలో 47.6, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3, ప్రకాశం జిల్లా కొండపిలో 46.7, మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో 46.2, కృష్ణా జిల్లా మద్దూరులో 45.8, తూర్పుగోదావరి జిల్లా గాడాలలో 45.7, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలలో 45.2, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలలో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు ఏలూరు జిల్లాలో తొమ్మిది మంది, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఎండ తీవ్రతకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ఖాళీ స్థలంలో పార్క్ చేసిన కారులో మంగళవారం మంటలు చెలరేగాయి. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చి మంటలను అదుపుచేశారు. అయితే, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి వరకు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. నెలాఖరు వరకు కోస్తాలో వడగాడ్పులు, రాయలసీమలో ఎండలు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
వాతావరణ అనిశ్చితితో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిశాయన్నారు. వీటిని రుతుపవన ముందుస్తు వర్షాలుగా పరిగణించాలని తెలిపారు. రుతుపవనాల రాకలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని, అదే సమయంలో వాతావరణ అనిశ్చితితో మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వచ్చే నెల రెండు లేదా మూడో తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు. అది బలపడుతుందో? లేదో? ఇప్పుడే చెప్పలేమని, అయితే ఈశాన్య భారతం వరకు రుతుపవనాల విస్తరణకు దోహదపడుతుందని వివరించారు.
నేడు నాలుగు జిల్లాల్లో 45-47 డిగ్రీలు
బుధవారం పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 45-47, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 42-44, మిగతా జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 68 మండలాల్లో తీవ్రంగా, 93 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని వివరించింది.