రాష్ట్రం భగభగ
ABN , Publish Date - Apr 28 , 2026 | 05:37 AM
ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమ సోమవారం నిప్పులకొలిమిలా మారాయి.
కంభంలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత
నేటి నుంచి పెరగనున్న వడగాడ్పులు
విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమ సోమవారం నిప్పులకొలిమిలా మారాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 45.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8, అమరావతి, తిరుపతి జిల్లా బేస్తపల్లి, కడప జిల్లా వీరబల్లిలో 44.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44, అన్నమయ్య జిల్లా నూలివీడులో 43.1, చిత్తూరు జిల్లా తవణంపల్లిలో 43, కర్నూలు జిల్లా కల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, కాకినాడ జిల్లా కరపలో 42.4, శ్రీసత్యసాయి జిల్లా ముడిగుబ్బలో 42.3, అనంతపురం, మన్యం జిల్లా బూర్జలో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 227 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఉపరితలద్రోణి ప్రభావంతో సోమవారం సాయంత్రం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని పలు ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంటుందని, వడగాడ్పులు వీస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. కాగా, మంగళవారం నుంచి వచ్చే నెల నాలుగోతేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు తెలిపారు.