Share News

డిగ్రీలో అనుభవాత్మక విద్య

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:13 AM

ఉన్నత విద్యలో ప్రతీ విద్యార్థికి ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా.. తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది.

డిగ్రీలో అనుభవాత్మక విద్య

  • ఈ ఏడాది నుంచి అన్ని యూజీ కోర్సుల్లో అమలు

  • ప్రతీ సెమిస్టర్‌లో తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌.. 2 క్రెడిట్స్‌

  • ఉన్నత విద్యామండలి నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో ప్రతీ విద్యార్థికి ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా.. తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అనుభవాత్మక విద్యను తప్పనిసరి చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి మూడేళ్ల యూజీ కోర్సుల్లో చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ చేయాలని నిబంధన ఉంది. అయితే తప్పనిసరి కాకపోవడం, దీనికి ప్రత్యేకంగా క్రెడిట్స్‌ కేటాయించకపోవడంతో విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక నుంచి దీనిని తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యామండలి అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీచేసింది. ఇది 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. డిగ్రీలో ఈ ఏడాది నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన కోర్సుల విద్యార్థులకు సైతం ఇది తప్పనిసరి కానుంది. కాగా ఇంటర్న్‌షిప్‌ విధానం ఇప్పటివరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లోనే అమలవుతోంది. ఇదే తరహాలో డిగ్రీలోనూ అమలుచేయాలని, దీంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో ఆదేశించారు. దీనిపై అధ్యయనం చేసిన ఉన్నత విద్యామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల డిగ్రీ విద్యార్థి 6 సెమిస్టర్లు అభ్యసించాల్సి ఉంది. ప్రతి సెమిస్టర్‌ ఆఖర్లో విద్యార్థి ఇంటర్న్‌షి్‌ప/ప్రాజెక్ట్‌ స్టడీ/ఫీల్డ్‌ వర్క్‌లలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలో ఇంటర్న్‌షి్‌పతోపాటు స్థానిక సమస్యలపై అధ్యయనం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలపై నివేదిక రూపొందించడం వంటివి చేయొచ్చు. విద్యార్థులకు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం, సమస్యలు గుర్తించి పరిష్కారాలు కనుగొనేలా ప్రోత్సహించడం ఈ నూతన విధానం లక్ష్యమని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి తెలిపారు. దీనికోసం ప్రతి సెమిస్టర్‌లో 2 క్రెడిట్స్‌ కేటాయించారు. ప్రతి యునివర్సిటీ, ప్రతి కళాశాల పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి బీఏ (సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ గవర్నమెంట్‌), బీఏ (డిఫెన్స్‌, సెక్యూరిటీ స్టడీస్‌), బీఏ (ల్యాండ్‌, అగ్రికల్చరల్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌)తోపాటు బీకాం, బీఎస్సీలో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సులు తీసుకున్న విద్యార్థులు సైతం కొత్త విధానాన్ని అమలుచేయాలని అన్ని యునివర్సిటీలను ఆదేశించింది.

Updated Date - Jun 12 , 2026 | 05:13 AM