Share News

రేపు జోజిలా టన్నెల్‌ ప్రారంభోత్సవం

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:53 AM

భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలను అనుసంధానించే.. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ‘జోజిలా టన్నెల్‌’ నిర్మాణంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది.

రేపు జోజిలా టన్నెల్‌ ప్రారంభోత్సవం

  • సముద్రమట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఇంజనీరింగ్‌ అద్భుతం

  • కశ్మీర్‌లో 13 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం నిర్మించిన ‘మేఘా ఇంజనీరింగ్‌’

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలను అనుసంధానించే.. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ‘జోజిలా టన్నెల్‌’ నిర్మాణంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. హిమాలయ పర్వత ప్రాంతంలో కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ నిర్మించిన 13.152 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ మంగళవారం ప్రారంభించనున్నారు. సముద్ర మట్టానికి దాదాపు 11,578 అడుగుల ఎత్తున, హిమాలయ పర్వత శ్రేణులను తొలిచి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సింగిల్‌ ట్యూబ్‌ ద్విముఖ రహదారి (బై డైరెక్షనల్‌) సొరంగంగా ఇది గుర్తింపు పొందింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ (ఎంఈఐఎల్‌) ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను దక్కించుకోగా, దాదాపు రూ.5వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. సొరంగ మార్గాన్ని రెండువైపులా ప్రారంభిస్తున్నప్పటికీ.. అంతర్గత రహదారులు, ప్లాస్టరింగ్‌ వంటి తుది నిర్మాణ పనులకు మరో ఏడాది సమయం పట్టనుంది.


కశ్మీర్‌ టూ లద్దాక్‌.. 365 రోజలూ నిరంతర సౌకర్యం

శీతాకాలంలో భారీ మంచు కారణంగా లద్దాక్‌ ప్రాంతానికి దేశంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయేవి. ఈ టన్నెల్‌ నిర్మాణ ప్రాంతంలో ఏడాదిలో 100 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో ఉంటాయి. అత్యంత ప్రతికూల వాతావరణం, ఆకస్మిక తుఫానులు ఇక్కడ సర్వ సాధారణం. ప్రాజెక్ట్‌ నిర్మాణం 2020లో ప్రారంభం కాగా, మొదటిదశ పనులు 2025 మార్చినాటికి విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుతో ఇకపై శ్రీనగర్‌-లద్దాక్‌ మధ్య 365 రోజులపాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ప్రమాదకరమైన మంచుకొండల్లో ప్రయాణించడానికి పట్టే సమయం కూడా తగ్గిపోనుంది. సోనమార్గ్‌ సమీపంలోని బా ల్తాల్‌ పశ్చిమ పోర్టల్‌ నుంచి ద్రాస్‌-కార్గిల్‌ ప్రాంతంలోని మీనమార్గ్‌ తూర్పు పోర్టల్‌ వరకు జోజిలా టన్నెల్‌ విస్తరించి ఉంది. ఈ టన్నెల్‌ నిర్మాణంతో కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్‌ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుంది. దేశ భద్రతలోనే కాకుండా పర్యాటక రంగ విస్తరణకు ఈ మార్గం ఉపయుక్తంగా ఉండనుంది. ఈ ఐదేళ్లకాలంలో పనులకు ఆటంకం కలిగిస్తూ ఐదు భారీ తుఫానులు సంభవించినప్పటికీ, దాదా పు 1200మంది శ్రామికులు వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. ప్రధాన టన్నెల్‌ మార్గాన్ని తొలి చే క్రమంలో రాతి నిర్మాణాల స్వభావం ఏకంగా 67 సార్లు మారింది. ఈ సవాళ్లను ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది అద్భుత నైపుణ్యంతో అధిగమించారు. రహదారులు, వంతెనలతో కలిపి ఈ ప్రాజెక్ట్‌ మొత్తం పొడవు 30.894 కిలో మీటర్లు కాగా, ఇంత పెద్ద సొరంగమార్గంలో గాలి ప్రసరణకు, అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉపయోగపడేలా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొండ పైనుంచి కిందకు మూడు వర్టికల్‌ షాఫ్ట్‌లను నిర్మించారు.

Updated Date - Jun 08 , 2026 | 06:54 AM