గండిపేట భూమి కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:06 AM
గండిపేట మండలంలో రూ.వెయ్యి కోట్ల విలువైన 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు రెవెన్యూ రికార్డులు...
తమిళనాడులో అదుపులోకి తీసుకున్న నార్సింగి, సైబరాబాద్ పోలీసులు
రూ.వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమిని కాజేసే కుట్రలో ప్రధాన నిందితుడు
ఈ కేసులో ఇప్పటికే పలువురి అరెస్టు
హైదరాబాద్ సిటీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): గండిపేట మండలంలో రూ.వెయ్యి కోట్ల విలువైన 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, ఇతర నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు శుక్రవారం సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కోసం బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అయితే, కేసు తీవ్రత, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు, ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో, నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బ్రహ్మనాయుడు కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో ఆయన ఆచూకీ కనుగొని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. సేకరించిన ఆధారాల ప్రకారం.. బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కాజేయడానికి కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఈ భూ కుంభకోణానికి సంబంధించి సుమారు రూ.12కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, ఇప్పటికే అరెస్టయిన రాధాకృష్ణకు రూ.4 కోట్లు, ఇతర సంబంధిత వ్యక్తులకు మరో రూ.4 కోట్లు చెల్లించినట్లు తేలింది.