డబుల్ రోడ్డు కోసం యువజన సంఘాల నిరాహార దీక్ష
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:02 AM
మండల కేంద్రంలో యువజన సంఘాల దీక్ష సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుండపల్లి స్టేజి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో నిరాహార దీక్ష నిర్వహించాలని యువజన సంఘాలు నిర్ణయించి పోలీసుల అనుమతి కోరాయి. పోలీసులు
గన్నేరువరం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో యువజన సంఘాల దీక్ష సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుండపల్లి స్టేజి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో నిరాహార దీక్ష నిర్వహించాలని యువజన సంఘాలు నిర్ణయించి పోలీసుల అనుమతి కోరాయి. పోలీసులు దీక్షకు అనుమతి ఇవ్వలేదు. మండల కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించారు. అయినా యుజవన సంఘాల నాయకులు అనుకున్న సమయానికి మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్దకు చేరుకుని దీక్ష ప్రారంభించారు. వీరికి వివిధ పార్టీల నాయకులు, ప్రజలు మద్దతు ప్రకటించారు. డబుల్ రోడ్డును వెంటనే వేయాలని, లేదంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బలవంతంగా వాహనంలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల అధ్యక్షుడు కాలువ నాగరాజు, యూత్ కాంగ్రెస్ మాజీ నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవిందర్‌రెడ్డి, బీజెపి నాయకుడు ముత్యాల జగన్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తాను గెలిచాక వంద రోజుల్లో డబుల్ రోడ్డు పూర్తి చేస్తానన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మూడేళ్లు కావస్తున్నా రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదన్నారు. 15 రోజుల్లో డబుల్ రోడ్డు పనులను ప్రారంభించకుంటే యువజన సంఘాల ఆధ్వర్యంలో అన్ని పార్టీల మద్ధతుతో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తమని హెచ్చరించారు. డబుల్ రోడ్డు సాధన కోసం యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్ ఓ ప్రకటనలో తెలిపారు.