చెవి నొప్పి చికిత్సకు వెళ్తే ప్రాణమే పోయింది!
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:29 AM
చెవి నొప్పి చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు.. వైద్యం వికటించి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది...
ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి యువకుడి మృతి
నిజామాబాద్‌లో ఘటన
నిజామాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చెవి నొప్పి చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు.. వైద్యం వికటించి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భీంగల్ మండలం పల్లికొండకు చెందిన అజయ్ (21) కొంతకాలంగా చెవి నొప్పితో బాధ పడుతున్నాడు. చికిత్స చేయించుకోవడానికి మంగళవారం నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడిలో గల ద్వారకా ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అయితే అక్కడి వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. బుధవారం ఉదయం ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తూ యువకుడికి మత్తు ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. అయితే ఏం జరిగింతో తెలియదు గానీ కాసేపటికే ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతడిని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వారు తెలిపారు. అయితే ద్వారకా వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. మత్తు వైద్యులు ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ వికటించడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. మృతుడి అన్న నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.