గంజాయి మత్తులో యువత చిత్తు
ABN , Publish Date - May 03 , 2026 | 11:39 PM
ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత గంజాయి మ త్తులో చిత్తవుతోంది.
అడ్డాలుగా శివారు గ్రామ ప్రాంతాలు
రాత్రి సమయాల్లో మితిమీరుతున్న ఆగడాలు
దొంగతనాలకు అలవాటు
చండూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత గంజాయి మ త్తులో చిత్తవుతోంది. సరదాగా మొదలవుతున్న గంజాయి అలవాటు శరవేగంగా వ్యసనంగా మారుతోంది. చౌవకగా దొరుకుతుండడంతో నిర్మానుష్య గ్రామశివారు ప్రాంతాలు, పాడుబడిన షెడ్లు, వెంచర్లు మత్తుకు అడ్డాలుగా మారుతున్నాయి. పిల్లల భవిష్యత్తుపై ఏం చేయాలో తెలి యక తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. గంజా యిని పూర్తిగా నిర్మూలిస్తామన్న ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా వాస్తవరూపం దాల్చడం లేదు. కొందరు యువ కులు గంజాయి మత్తుకు బానిసవుతున్నారు. బైకులు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బంగారం కుదువపెట్టి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రూ.10వేల నుంచి రూ.50వేల వరకు బెట్టింగ్ పెడుతూ పేకాట ఆడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బిస్కెట్లు విక్రయించే వారి ద్వారా గంజాయి సరఫరా అవుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. 30గ్రాముల చొప్పున చిన్నచిన్న ప్యాకెట్లలో నింపి రూ.100 నుంచి రూ.500వరకు విక్రయిస్తున్నారు. తమ బిడ్డలను దారికి తెచ్చుకోలేక ఎవరికీ చెప్పుకోలేక తల్లిదండ్రులు మానసికక్షోభ అనుభవిస్తున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నా యువకుల్లో మార్పు రావడం లేదు. పట్ణణాలకే పరిమితమైన గంజాయి దందా ఇప్పుడు పల్లెలు, మారుమూల ప్రాంతాలకు పాకింది. గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో యువకులు గుంపులుగా చేరి గంజాయి తాగి, విచక్షణ కోల్పోతున్నారు. మత్తుకు బానిసై దొంగతనాలు, దోపిడీలకు ప్పాడుతున్నారు. డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే ఆరో గ్యానికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంజా యి సేవించిన తర్వాత విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. మత్తుకు అల వాటుపడి దొంగతనాలు, ఇంట్లో విలువైన సామాన్లు అమ్ము కుంటున్నారు. గ్రామ శివారులు, దూర ప్రాంతాలను అడ్డాగా చేసుకున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మత్తు పదార్ధాలను కట్టడి చేసినా అమ్మకాలు మాత్రం అగడం లేదు.
మత్తు పదార్థాల విక్రయంపై ఉక్కుపాదం
మత్తు పదార్థాలు సేవించడం, క్రయవిక్రయాలు జరిపే వారిపై ఉక్కుపాదం మోపుతాం. గంజాయి సేవించడం ద్వారా శరీరంలో మానసిక మార్పులు వస్తాయన్న అపోహతో చాలామంది విద్యార్థులు అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి అపోహలకు పోకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఇప్పటికే పాఠశాల స్థాయిలో విద్యార్ధులకు అవగాహన కల్పించాం. గంజాయి, పేకాట స్థావరాలపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.
శివకుమార్, చండూరు ఎస్‌ఐ