ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:34 AM
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం...
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం ఢిల్లీలోని ఏఐ సమ్మిట్ జరుగుతున్న భారత మండపంలోని హాలు నంబర్ 5లోకి దూసుకొచ్చిన పలువురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసనకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ, డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు ప్రింట్ చేసిన టీషర్డులను ప్రదర్శించడంతో పాటు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎప్‌స్టీన్ ఫైళ్ల విషయంలో మోదీ లొంగిపోయారంటూ ఆరోపణలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి బయటకు లాక్కెళ్లారు. యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త, జడ్చర్లకు చెందిన పి.నరసింహ యాదవ్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే కాంగ్రెస్ నేతలు ఈ విధంగా వ్యవహరించారని బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కాంగ్రెస్ ప్రవర్తించడం సిగ్గు చేటని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు బీజేపీ అగ్ర నేతలు దుయ్యబట్టారు.
కాంగ్రెస్ తీరు క్షమార్హం కాదు: కిషన్‌రెడ్డి
దేశాభివృద్ధిని ప్రతిబింబించే ఏఐ సదస్సు లాంటి కార్యక్రమాల్లో హుందాతనాన్ని ప్రదర్శించాల్సింది పోయి, కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు క్షమార్హం కాదన్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.