Share News

kumaram bheem asifabad- పెరిగిన మీ సేవ చార్జీలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 10:58 PM

రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత మీ సేవ ధరలను సవరించింది. ఏప్రిల్‌ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి రాగా, జిల్లాలోని విద్యార్థులు, పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. మీసేవా కేంద్రాల్లో దాదాపు 360 రకాల సేవలందుతున్నాయి. డిమాండు ఉన్న ప్రాంతాల్లో సగటున ప్రతి రోజు 200 మందికి పైగా వివిధ ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

kumaram bheem asifabad- పెరిగిన మీ సేవ చార్జీలు
మీ సేవలో లభించే సేవల పట్టిక

రెబ్బెన, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత మీ సేవ ధరలను సవరించింది. ఏప్రిల్‌ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి రాగా, జిల్లాలోని విద్యార్థులు, పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. మీసేవా కేంద్రాల్లో దాదాపు 360 రకాల సేవలందుతున్నాయి. డిమాండు ఉన్న ప్రాంతాల్లో సగటున ప్రతి రోజు 200 మందికి పైగా వివిధ ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరితో పాటు ప్రభుత్వ పథకాల కోసం సైతం ప్రజలు మీ సేవా కేంద్రాల బాటే పడుతున్నారు. గతంలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు కావాలన్న సంబంధిత కార్యాలాయానికి వెళ్లాల్సి వచ్చేది. ఆఫ్‌లైన్‌లోనే మంజూరు చేయడంతో ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే వారు.

- విద్యార్థులకు కుల, ఆదాయ..

పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభం సమయంలో విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు తహసిల్దార్‌ కార్యాల యం వద్ద నిరీక్షించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా మీ సేవా కేంద్రాల ద్వారానే ధ్రువ పత్రాలు చేతికందుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఈ సేవా కేంద్ర ఒకటి ఉండగా, మీ సేవా కేంద్రాలు 60, ఓఎస్‌ఎస్‌ సెంటర్లు 11 ఉన్నాయి. భూములకు సంబంధించిన పత్రాలతో పాటు భూముల క్రయ విక్రయాలు, ఈసీ విద్యార్థులకు కావాల్సిన కులం, ఆదాయం, నివాసం, క్రిమిలేయర్‌, నాన్‌ క్రిమిలేయర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఇతర 360కి పైగా రకాల సేవలను మీ సేవా కేంద్రాల ద్వారా అందుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం మీ సేవా చార్జీలను దాదాపు 45 శాతం పెంచింది. రూ.45 ఉన్న చార్జీలు ఏకంగా రూ.80కి పెరిగాయి. ట్యాక్స్‌ పేమెంట్‌ సేవలకు గతంలో రూ.35 వసూలు చేయగా, ప్రస్తుతం రూ.62కు పెంచారు. ఒకేసారి ఒక్కొ సర్టిఫికెట్‌పై రూ.35 పెంచడంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. 2011 మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అప్పల్లో కేటగిరి ఏ కింద అందించేందుకు ధ్రువ పత్రాలకు రూ.25 వసూలు చేయగా, కేటగిరి బీ కింద అందించేందుకు ధ్రువ పత్రాలకు రూ.35 వసూలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో ప్రభుత్వం సర్దుబాటు పేరుతో చార్జీలను సవరించింది. అయితే కేటగిరి ఏ కింద వచ్చే సర్టిఫికెట్లకు రూ.10 పెంచి రూ.35 చేసింది. ఒక కేటగిరి బి కింద అందించే సర్టిపికెట్లకు చార్జీలను రూ.35 నుంచి రూ.45కు పెంచింది. అప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 45 శాతం చార్జీలను పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే గతంలో రూ.1600 మాత్రమే ఉంది. కాగా ఇప్పుడు మాత్రం రూ.2005 వసూలు చేస్తోంది. అలాగే వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ చార్జి గతంలో రూ.5,295 ప్రస్తుతం రూ.9,230 తీసుకుంటున్నారు. ఇలా అన్ని రకాల సేవల చార్జీలను భారీగా పెంచడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది.

చార్జీలు పెరిగాయి..

లక్ష్మీనారాయణ, మీ సేవా కేంద్రం నిర్వహకుడు

మీ సేవ కేంద్రాల చార్జీలను ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి పెంచింది. ప్రస్తుతం పెరిగిన చార్జీలనే వసూలు చేస్తున్నారు. గతంలో కేటగిరి ఏ కింద ఇచ్చే సర్టిఫికెట్లకు రూ.35 ఉండగా, ప్రస్తుతం రూ.60నుంచి రూ.80 వరకు పెరిగింది. అలాగే కేటగిరి బీ కింద ఇచ్చే సర్టిఫికెట్లకు గతంలో రూ.45 తీసుకునే వాళ్లం, ఇప్పుడు చార్జీలు పెరగడంతో రూ.80 తీసుకుంటున్నాం.

Updated Date - Jun 17 , 2026 | 10:58 PM