ఆయన ఎక్కువగా దుబాయిలోనే..!
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:02 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు దుబాయికి లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పట్టుబడ్డ ఓ యువ రాజకీయ నాయకుడు ఎక్కువగా దుబాయిలోనే ....
ఫాంహౌస్ కేసులో పట్టుబడ్డ యువ రాజకీయ నేతకు పలు దేశాల్లో వ్యాపారాలు
ఆఫ్రికాలో గనులు.. ప్రధాన వ్యాపారం!
దుబాయిలో సినీ నిర్మాత మృతి సమయంలోనూ మార్మోగిన పేరు!
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసుకు దుబాయికి లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పట్టుబడ్డ ఓ యువ రాజకీయ నాయకుడు ఎక్కువగా దుబాయిలోనే గడుపుతారని సమాచారం. దుబాయితో పాటు పలు దేశాల్లో ఆయనకు వ్యాపారాలు ఉన్నట్లు తెలిసింది. భారత్ నుంచి పెద్దమొత్తంలో సొమ్ములను విదేశాలకు తరలిస్తారని.. వాటితో అనేక దేశాల్లో వ్యాపారాలు చేస్తారని సమాచారం. ఆ నేతకు ఆఫ్రికా దేశాల్లో గనుల వ్యాపారం ప్రధానమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక వ్యాపార కార్యకలాపాల కంటే వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఎక్కువగా దుబాయిలో గడపడానికి ఇష్టపడతారని తెలుస్తోంది. పార్టీలు, జల్సాలు చేసుకోవడం అంటే మక్కువ ఎక్కువ అని సమాచారం. భారత్‌లోని పలువురు ప్రముఖులు ఆ నేతతో విదేశాల్లో వ్యాపార అవకాశాల గురించి సంప్రదింపులు జరుపుతుంటారని..వారిని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నాయకుడు సమన్వయం చేస్తుంటాడని తెలుస్తోంది. గతంలో ఓ సినీ నిర్మాత దుబాయిలో మరణించిన సమయంలోనూ ఈ నాయకుడి పేరు వినిపించింది. సినీ నిర్మాత మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాకుండా అతని కుటుంబ సభ్యులు దుబాయిలోనే అంత్యక్రియలు జరపడానికి కూడా ఈ బృందం చేసిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, నమూనాలు సేకరించి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఈ బృందంతో సంబంధం ఉన్న వారికి ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతోనే దుబాయిలో అంత్యక్రియలు కానిచ్చేసినట్లు సమాచారం. ఆ నిర్మాత మృతి చెంది ఏడాది పూర్తయినా బినామీ ఆస్తుల పంపకాలు పూర్తి కాలేదని తెలుస్తోంది. మరణించిన నిర్మాత భార్య అమెరికా పౌరురాలు కావడంతో దుబాయి సహా ఎక్కడైనా తన భర్త పేరిట ఉన్న ఆస్తులను దక్కించుకోవడంలో ఆమెకు అమెరికా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక ఏపీకి చెందిన మరో రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఆఫ్రికాలో విజయవంతంగా గనుల వ్యాపారం చేస్తూ దుబాయిని కేంద్రంగా మార్చుకుంటున్నట్లు తెలిసింది.