Share News

IPS Officer: ట్రాఫిక్‌ సమస్యకు యువ ఐపీఎస్‌‌లతో చికిత్స

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:23 AM

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజాసమస్యల పరిష్కా రం లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నారు.

IPS Officer: ట్రాఫిక్‌ సమస్యకు యువ ఐపీఎస్‌‌లతో చికిత్స

  • హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి

  • చురుగ్గా పనిచేసే ఐపీఎస్‌ అధికారులు ట్రాఫిక్‌కు బదిలీ

  • అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు

హైదరాబాద్‌ /హైదరాబాద్‌ సిటీ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజాసమస్యల పరిష్కా రం లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలంగా హైదరాబాద్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే యువ ఐపీఎస్‌ అధికారులను నియమించారు. శనివారం జరిగిన ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో ఈ విషయం స్పష్టమైంది. హైదరాబాద్‌ పోలీసు విభాగం ముఖచిత్రాన్ని మారుస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు కమిషనరేట్లలో యువ ఐపీఎస్‌ అధికారులను నియమించడం వెనుక ఇటీవల రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్‌ విభాగాన్ని బలోపేతం చేసేందుకు నూతన ట్రాఫిక్‌ వ్యవస్థను డీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని సీఎం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఐపీఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించడం ఇందులో భాగమేనని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.


గ్రేటర్‌లో యువ దళం

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి-రాచకొండ, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ వ్యవస్థను బలోపేతం చేసేలా తాజా బ దిలీలు జరిగాయంటున్నారు. వివిధ జిల్లాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన యువ ఐపీఎ్‌సలకు ట్రాఫిక్‌ డీసీపీ బాధ్యతలను అప్పగించారు. కొత్తగూడెం అదనపు ఎస్పీగా ఉన్న అవినాష్‌ కుమార్‌ను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-1 (ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ జోన్లు), ఉట్నూరు అదనపు ఎస్పీగా ఉన్న కాజల్‌ను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-2 (గోల్కొండ, జూబ్లీహిల్స్‌ జోన్లు)గా నియమించారు. రాహుల్‌ హెగ్డేకు చార్మినార్‌ -రాజేంద్రనగర్‌ - శంషాబాద్‌ జోన్ల బాధ్యతలు అప్పగించారు. అలాగే జగిత్యాల అదనపు ఎస్పీగా ఉన్న శేషాద్రిని రెడ్డిని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-2 (కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్లు) గా, భువనగిరి అదనపు ఎస్పీ గా పనిచేసిన కనకాల రాహుల్‌రెడ్డ్డికి మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ డీసీపీ-1 బాధ్యతలు అప్పగించారు. ములుగు జిల్లా అదనపు ఎస్పీగా పనిచేసిన శివం ఉపాఽధ్యాయను ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ డీసీపీగా, చందనా దీప్తిని ఫ్యూచర్‌ సిటీ ట్రాఫిక్‌ అదనపు సీపీగా, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రంజన్‌ రతన్‌ కుమార్‌ ను నియమించారు. మల్కాజిగిరి ట్రాఫిక్‌-2 డీ సీపీ శ్రీనివాసులును అక్కడే కొనసాగించారు.

ట్రాఫిక్‌పై గూగుల్‌తో ఒప్పందం

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ట్రాఫిక్‌ పర్యవేక్షణకు ఇటీవల గూగుల్‌ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ట్రాఫిక్‌ విభాగంలో రెండు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌ లైవ్‌ ట్రాఫిక్‌ డేటాను టీజీఐసీసీసీకి అనుసంధానం చేయడం, వాహనాల స్థితి ఆధారంగా చేసుకొని ఆటోమేటెడ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం, ప్రస్తుత ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడానికి అవసరమైన టెక్నాలజీ వినియోగంపై పోలీస్‌ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఈ యువ ఐపీఎ్‌సలు కీలక పాత్ర పోషించనున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 04:23 AM