Share News

జూన్‌ 2న స్కిల్స్‌ వర్సిటీ భవనాల ప్రారంభం

ABN , Publish Date - Feb 15 , 2026 | 06:20 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

జూన్‌ 2న స్కిల్స్‌ వర్సిటీ భవనాల ప్రారంభం

  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. 4 బ్లాకులుగా 3.95

  • లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం

  • ప్రస్తుతం అద్దె భవనంలో విశ్వవిద్యాలయం

  • మహీంద్రా సహా పలు ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. వర్సిటీ భవనాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆలోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రాంతంలో (నెట్‌ జీరో వ్యాలీ) మీర్‌ఖాన్‌ పేట దగ్గర దాదాపు 50 ఎకరాల స్థలం వర్సిటీకి కేటాయించగా అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు, ల్యాబ్‌లు, హాస్టల్‌ బ్లాక్‌లను దాదాపు 3.95 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అకడమిక్‌ బ్లాక్‌ 89,373 చదరపు అడుగులు, ల్యాబ్‌లు 96,671 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 43 తరగతి గదులు, 60 పడకల సామర్థ్యంతో హాస్టల్‌తో పాటు హెల్త్‌ సెంటర్‌, షాపింగ్‌ సెంటర్‌, సెంట్రలైజ్డ్‌ కిచెన్‌, భోజనశాల ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలోనే పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. సొంత భవనాన్ని మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.200 కోట్లతో నిర్మిస్తోంది. నిర్మాణ పనులతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. యువతకు పలు రంగాల్లో నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్స్‌ వర్సిటీని స్థాపించి.. సొంత భవనానికి 2024 ఆగస్టులో సీఎం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. వర్సిటీ గత ఏడాది డిసెంబరు నాటికే 1,000 మందికి పైగా విద్యార్థులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చింది. పలు రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు వారికి అవసరమైన విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ఇప్పటికే ప్రణాళిక రచించారు.


కొన్ని సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదిరినట్లు సమాచారం. మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్‌ రంగంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాయే వర్సిటీ గవర్నింగ్‌ బోర్డు అధ్యక్షునిగా ఉన్న సంగతి తెలిసిందే. వైద్య రంగంలో ఉన్న మరో ప్రముఖ సంస్థ పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. ఆ సిలబ్‌సను కూడా ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు సంబంధించి తరగతులు నిర్వహించేందుకు పలు పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సినిమా పరిశ్రమను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ రంగానికి అవసరమైన అత్యాధునిక టెక్నాలజీ, ఇతర విభాగాల్లో ప్రముఖ సంస్థల సహకారంతో తరగతులు నిర్వహించనున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 06:28 AM