నీకు కాంట్రాక్టు.. నాకు 2.5 కోట్లు!
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:57 AM
పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఓ జిల్లాకు గతంలో కలెక్టర్‌గా పనిచేశారామె! ఇప్పుడు ఒక శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. అక్కడ టెండరు వ్యవహారాలను ఓకే చేసే బాధ్యత ఆమెదే.
ఏకపక్షంగా టెండర్ కట్టబెట్టినందుకు ఓ ఐఏఎస్ అధికారిణికి నజరానా
రూ.35-40 కోట్ల టెండరు.. మూడేళ్లుగా అదే సంస్థకు
ప్రభుత్వం, అధికారులు మారినా టెండరు ఆ కంపెనీకే
అధికారిణికి, కంపెనీకి మధ్యవర్తిగా ఏడీ స్థాయి అధికారి
ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైనవ్యవహారం
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఓ జిల్లాకు గతంలో కలెక్టర్‌గా పనిచేశారామె! ఇప్పుడు ఒక శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. అక్కడ టెండరు వ్యవహారాలను ఓకే చేసే బాధ్యత ఆమెదే. అదే శాఖలో పనిచేసే ఏడీ స్థాయి అధికారి.. సదరు ఐఏఎస్ అధికారిణికి, ఒక కంపెనీకి మధ్యవర్తిగా వ్యవహరించారు. ఆ సంస్థకు ఏకపక్షంగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు బేరం కుదిర్చారు. కాంట్రాక్టు దక్కగానే సదరు సంస్థ ఆ అధికారిణికి ఏకంగా రూ.2.5 కోట్లు ‘నజరానా’గా ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడా శాఖలో ఏ ఒక్కరి నోట విన్నా ఇదే టాపిక్! ఈ కాంట్రాక్టుకు సంబంధించి.. సదరు అధికారిణికి, కంపెనీకి మధ్య జరిగిన చర్చ అంతా వాట్సాప్ కాల్‌ద్వారానే జరిగినట్టు సమాచారం. కాంట్రాక్టు తమకి చ్చినందుకుగాను.. రూ.2.5 కోట్లను ఆ సంస్థ అధిపతి 2 విడతలుగా ఆ ఐఏఎస్ అధికారిణికి అందజేసినట్టు తెలుస్తోంది. ఆ విభాగంలోకి ఏ అధికారి వచ్చినా, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రూ.35-40 కోట్ల ఆ టెండరు మాత్రం మూడేళ్లుగా అదే సంస్థకు దక్కుతుండడం గమనార్హం.
ఈసారి కూడా అదే సంస్థ దాన్ని దక్కించుకుంది. దీనికి ప్రధానకారణం ఆ ఏడీ స్థాయి అధికారేనని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఒకే సంస్థకు టెండరు దక్కడం వెనుక గుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దందాలో అధికారిణికి, కాంట్రాక్టు సంస్థకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఏడీ స్థాయి అధికారికి ఖమ్మం సమీపంలో కొణిజర్ల వద్ద 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం. ఆ భూమి కూడా ఖమ్మం-వైరా ప్రధాన రహదారి పక్కన ఉన్నట్లు తెలుస్తోంది. దాని విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. ఆ అధికారి తరచూ భూమి సమీపానికి వెళ్లాక కారు డ్రైవర్‌ను అక్కడే వదిలేసి, తానే డ్రైవ్ చేసుకుంటూ భూమి వద్దకు వెళ్తారని సిబ్బంది చెబుతున్నారు.