Share News

మొన్న విజయారెడ్డి.. నిన్న ఐశ్వర్య

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:30 AM

మొన్న విజయారెడ్డి.. నిన్న ఐశ్వర్య.. కన్న బిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడారు. నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనలు కలవర పెడుతున్నాయి.

మొన్న విజయారెడ్డి.. నిన్న ఐశ్వర్య
విజయారెడ్డి..

కన్న బిడ్డలతో కలిసి బలవన్మరణాలు

కలవరపెడుతున్న వరుస ఘటనలు

బీబీనగర్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మొన్న విజయారెడ్డి.. నిన్న ఐశ్వర్య.. కన్న బిడ్డలతో కలిసి బలవన్మరణానికి పాల్పడారు. నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనలు కలవర పెడుతున్నాయి. నెల రోజుల క్రితం చర్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాప్ట్‌వేర్‌ ఉద్యోగి విజయరెడ్డి ఘటన మరువకముందే, యాదాద్రి జిల్లాలో మంగళవారం జరిగిన మరో విషాద ఘటన కలవరానికి గురిచేసింది. బీబీనగర్‌ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల ఐశ్వర్య(25) ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. అందరూ ఉండి కూడా ఒంటరిగా జీవించాల్సి వస్తుందని ఒకరు.. కట్టుకున్న భర్తే వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్న తీరు మరొకరిది. కారణాలు ఏవైనా ఇద్దరూ అనుభవించింది మనోవేదనే. అనుక్షణం మనసును చిధ్రం చేస్తున్న మానసిక సంఘర్షణల నుంచి బయట పడలేక ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే క్షోభకు గురైన వారే. ప్రశాంతత కరువై జీవితంపై విరక్తిచెంది చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు. మానసిక పరమైన ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందలేక ప్రాణం పోతేనే ప్రశాంతత అనే భావనకు లోనవుతున్నారని ఈ రెండు ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. రక్తం పంచి జన్మనిచ్చిన పేగు బంధాలను కూడా వారి బలహీనతకు బాధ్యులను చేస్తూ ఎంతో భవిష్యత్తు చూడాల్సిన తమ పిల్లల ప్రాణాలను బలిపెడుతున్న వైనం ప్రజలను మరింత భయపెడుతుంది. ఈ సంఘటనలు వేర్వేరు చోట్ల జరిగినప్పటికీ వారిద్దరిదీ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కావడం గమనార్హం.

కష్టసుఖాలు పంచుకునే వారులేరని..

బీబీనగర్‌ మండలకేంద్రానికి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని పిన్నింటి విజయారెడ్డి గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తుండగా భర్త సురేందర్‌రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేసేవారు. వీరికి ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం చదువుతున్న కూతురు చైతన్యరెడ్డి, మొదటి సంవ త్సరం చదువుతున్న కొడుకు విశాల్‌రెడ్డి ఉన్నారు. వీరి హాస్టల్‌లో ఉంటు చదువుకుంటుండగా విజయరెడ్డి ఉద్యోగి రిత్యా బోడుప్పల్‌లో తల్లితో కలిసి ఉంటున్నారు. మంచి వేతనంతో ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ కష్టసుఖాలు పంచుకునేందుకు పక్కన అయినవారు లేరనే మానసిక వేదన వెంటాడింది. దీంతో ఆమె జనవరి 31వ తేదీన తెల్లవారితే భర్త పుట్టిన రోజున ఇద్దరు పిల్లలను హాస్టల్‌ నుంచి వెంట తీసుకుని చర్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసు కుంది. ఈ ఘటన ఉభయ రాష్ర్టా ప్రజలను దిగ్ర్భాంతికి గురి చేసింది.

వేధింపులు తాళలేక..

బీబీనగర్‌మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల ఐశ్వర్య భర్తతో గొడవల కారణంగా ఏడాదిగా భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా, వివాహేతర సంబంధం అంటగట్టి భర్త వేధి స్తున్నాడని మనస్తాపంతో ఈ నెల 2న పుట్టింటి నుంచి భర్త ఇంటికి చేరిన మరుసటి రోజు ఈ నెల 3న తెల్లవారే సరికి రెండేళ్ల కూతురు ఝాన్సీ, 10నెలల కుమారుడు పండును చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయరెడ్డి, ఐశ్వర్యలు తీసుకున్న ఈ కఠిన నిర్ణ యాలు సమాజానికి హెచ్చరికగా నిలుస్తున్నాయి. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా మహిళల్లో మానసిక పరివర్తన పెంచేందుకు ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు కౌన్సిలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:30 AM