Share News

ఎల్లంపల్లి ఎత్తిపోతలపైనే ఆశలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:10 AM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉత్తర తెలంగాణ రైతుల చూపంతా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపైనే ఉంది. వానలు ముఖం చాటేయడంతో సాగునీటి పరిస్థితిపై ఆందోళన చెందుతున్న రైతులు ప్రాజెక్టులోకి వచ్చే నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయి నిల్వకు చేరువ కావడంతో ఎత్తిపోతలపై ఆశలు

ఎల్లంపల్లి ఎత్తిపోతలపైనే ఆశలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉత్తర తెలంగాణ రైతుల చూపంతా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపైనే ఉంది. వానలు ముఖం చాటేయడంతో సాగునీటి పరిస్థితిపై ఆందోళన చెందుతున్న రైతులు ప్రాజెక్టులోకి వచ్చే నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయి నిల్వకు చేరువ కావడంతో ఎత్తిపోతలపై ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.091 టీఎంసీలకు చేరుకుంది. మరో టీఎంసీ మేర నీరు చేరితే ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోనున్నది. గత 22 రోజుల్లో ప్రాజెక్టులోకి 5.27 టీఎంసీల నీరు చేరడం కొంత ఊరటనిస్తోంది.

ఫ ప్రాజెక్టులోకి 47 టీఎంసీల వరకు వరద నీరు

జూన్‌ నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోశారు. ఇప్పటి వరకు మిడ్‌మానేరుకు 15.192 టీఎంసీల నీటిని తరలించగా, అదనంగా వచ్చిన 17.433 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 47 టీఎంసీల వరకు వరద నీళ్లు వచ్చాయి. జూన్‌ నెలాఖరులో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురియడంతో ప్రాజెక్టులోకి వరద నీరు రావడం మొదలయ్యింది. జూన్‌ 29వ తేదీ సాయంత్రం వరకు ప్రాజెక్టు నీటి మట్టం 11.110 టీఎంసీలకు చేరడంతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని అంచనా వేసిన అధికారులు ఆ వెంటనే ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు నంది, గాయత్రి పంపు హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆగస్టు 11వ తేదీన ప్రాజెక్టు నీటి మట్టం 14.315 టీఎంసీలకు తగ్గడంతో తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకున్న నీటి పారుదల శాఖాధికారులు ఎత్తిపోతలను నిలిపి వేశారు. అప్పటి నుంచి పెద్దగా వానలు కురవక పోయినా అప్పుడప్పుడు పడిన వానలతో 22 రోజుల్లో ప్రాజెక్టులోకి 5.276 టీఎంసీల నీళ్లు చేరాయి. శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చిన వరదల వల్లనే మిడ్‌ మానేరుకు నీటిని తరలించగలిగారు. అక్కడి నుంచి ఎల్‌ఎండీకి 6 టీఎంసీల వరకు తరలించడంతో ఎల్‌ఎండీ నీటి మట్టం 24 టీఎంసీలకు 10.872 టీఎంసీలకు చేరుకున్నాయి. మిడ్‌ మానేరు పూర్తి స్థాయి నీటి మట్టం 27.5 టీఎంసీలకు 20.516 టీఎంసీలకు నీళ్లు చేరాయి.

ఫ ఎస్సారెస్పీలో సగం నీళ్లే..

గత ఏడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో సుమారు 78 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం 44.937 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవాలంటే 36 టీఎంసీల వరకు నీరు రావాల్సి ఉంది. ప్రాజెక్టులోకి 60 టీఎంసీల నీళ్లు వస్తే గానీ ఆయకట్టు భూములకు నీటిని వదిలే పరిస్థితి లేదు. గత ఏడాది ఆయకట్టుకు ఆగస్టు 18వ తేదీ నుంచి నీటిని విడుదల చేయగా, ఈ ఏడాది ప్రాజెక్టులోకి సరిపడా నీళ్లు రాకపోవడంతో ఆయకట్టు భూములకు ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదు. ప్రాజెక్టు ఎక్కువ భాగాన మహారాష్ట్రలో గల గైక్వాడ్‌, విష్ణుపురి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. అయితే వాటి ఎగువ భాగాన కూడా వర్షాలు పడకపోవడంతో ఎస్సారెస్పీలోకి వరద నీరు రావడం లేదు. ఎస్సారెస్పీ కింద ప్రధానంగా పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోని ఆయకట్టు భూములు ఉన్నాయి. అలాగే చెరువులు, కుంటలు కూడా నిండలేదు. వర్షాలు పడి ప్రాజెక్టు నిండుతుందని భావనతో రైతులు అత్యధికంగా వరి పంటను సాగు చేశారు. ఈ నెలాఖరులోగా ఎస్సారెస్పీలోకి సరిపడా నీళ్లు రాకుంటే మాత్రం ఆయకట్టు భూముల్లో వేసిన వరి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం శ్రీపాద ఎల్లంపల్లికి వరద వచ్చినా నీటిని ఎత్తిపోసుకుంటే లింక్‌ కాలువ ద్వారా వరద కాలువ ద్వారా రివర్స్‌ ఎత్తిపోతల ద్వారా జగిత్యాల, మిడ్‌ మానేరు నుంచి మరిన్ని నీళ్లు ఎల్‌ఎండీకి వదిలితే దాని కింద ఉన్న భూములకు నీటిని వదిలి పంటను కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని రైతులు అంటున్నారు.

ఫ వానల కోసం ఎదురుచూపులు

ఎత్తిపోతలకు ఇక ఢోకా లేదని భావించిన సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో నీటి ఎత్తిపోతలను నిలిపివేయాల్సి వచ్చింది. సాధారణంగా ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిసి శ్రీరాంసాగర్‌తో పాటు ఉత్తర తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులు నిండుతాయని రైతులు ఆశిస్తారు. ఈ అంచనాలతోనే ఈ సీజన్‌లో అత్యధికంగా వరి సాగు చేపట్టారు. అయితే అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సాగునీటి లభ్యతపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో నీటి నిల్వ 19 టీఎంసీలు దాటడంతో రైతుల్లో కొంత ఆశ నెలకొంది. ఎల్లంపల్లికి ఈ నెలంతా వరద నీరు వస్తేనే ఎత్తిపోతల ద్వారా ఉత్తర తెలంగాణలో సాగునీటికి భరోసా లేకుండా పోతుందని రైతులు ఆశిస్తున్నారు.

Updated Date - Sep 03 , 2026 | 01:10 AM