సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:32 AM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. ‘‘వాడు, వీడు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్’’ అంటూ దూషించిన వైసీపీ ఏపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
వాడు, వీడు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్ అంటూ దూషించిన వైనం
బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు
ఏపీలోని గుంటూరులో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకొచ్చిన రాష్ట్ర పోలీసులు
గుంటూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. ‘‘వాడు, వీడు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్’’ అంటూ దూషించిన వైసీపీ ఏపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు చెందిన టీవీ చానల్‌లో జరిగిన డిబేట్‌లో నాగార్జున యాదవ్ ఈ అనుచిత వ్యాఖ్య లు చేశారు. రేవంత్ ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని.. కనీసం జీవో చదవడం కూడా రాదని వ్యాఖ్యానించారు. ‘వాడు.. వీడు’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అతడిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదంది. అక్కడి పోలీసులు ఆదివారం గుంటూరులోని నాగార్జున యాదవ్ నివాసానికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, వైసీపీ నాయకులు తొలుత కొంత హడావుడి చేశారు. స్థానికంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించి.. తెలంగాణ పోలీసులు సివిల్ దుస్తుల్లో వచ్చారని, తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని చెప్పారు. అయితే.. బేగంబజార్ పోలీసులు తొలుత నల్లపాడు పోలీసులకు సమాచారం అందించే ఆయన్ను తీసుకెళ్లారని, నాగార్జున యాదవ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైందని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో మిన్నకుండిపోయారు. కాగా.. ఏపీకి చెందిన వైసీపీ నాయకుడు తెలంగాణ సీఎంను దూషించడాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కులాలు, ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ పన్నిన వ్యూహంలో భాగంగానే నాగార్జున యాదవ్ ఇలా రేవంత్‌ను దూషించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.