‘యశోద’లో సెంట్రల్ అంబులెన్స్ కమాండ్ సెంటర్
ABN , Publish Date - May 24 , 2026 | 05:11 AM
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లోను వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడటంలో యశోద హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన...
ఓఆర్‌ఆర్ రోడ్డు ప్రమాద బాధితుల కోసం ఏర్పాటు
ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్
హైదరాబాద్ సిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లోను వేగంగా స్పందించి ప్రాణాలు కాపాడటంలో యశోద హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ అంబులెన్స్ కమాండ్ సెంటర్’ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేష్ తెలిపారు. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్‌లో ఈ సెంటర్‌తో పాటు ‘స్పెషల్ కనెక్టెడ్ అంబులెన్స్ సర్వీసెస్ ’ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ వ్యవస్థతో ‘గోల్డెన్ అవర్’లో అత్యవసర వైద్య స్పందన మరింత సమర్థవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఆస్పత్రిస్థాయి అత్యవసర వైద్య సేవలను అంబులెన్స్ ప్రయాణ సమయంలోనే రోగికి అందించేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశామని యశోద హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఎ.లింగయ్య తెలిపారు. స్పెషల్ కనెక్టెడ్ అంబులెన్సుల్లో అత్యాధునిక రియల్ టైమ్ టెలీ-మానిటరింగ్, టెలీ-మెడిసిన్ సదుపాయాలు ఉంటాయన్నారు. వీటి ద్వారా ఆస్పత్రి వైద్య నిపుణులు రోగుల ఆరోగ్య పరిస్థితిని దూరం నుంచే పరిశీలిస్తూ, ప్రయాణ సమయంలో పారామెడికల్ సిబ్బందికి తక్షణ సూచనలు అందించగలరని చెప్పారు. రోగి ఆస్పత్రికి చేరుకునేలోగా కీలక వైద్య సదుపాయాలను సిద్ధం చేయవచ్చని వివరించారు.