Share News

వానాకాలంలో ఇచ్చినోళ్లందరికీ రైతు భరోసా!

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:11 AM

గత వానాకాలం సీజన్‌లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది.

వానాకాలంలో ఇచ్చినోళ్లందరికీ రైతు భరోసా!

  • ఏ కోతలు లేకుండా యాసంగి పెట్టుబడి సాయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గత వానాకాలం సీజన్‌లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంటకాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతుభరోసా చెల్లించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్‌ సర్వేతో లింకు పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి.. ఆ వెంటనే రైతులకు నగదు బదిలీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. మొత్తం 1,45,73,000 ఎకరాలకు రైతు భరోసా చెల్లించారు. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు రూ.9 వేల కోట్లు రైతులకు పంపిణీ చేశారు. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా చెల్లించనున్నారు. ఈనెల పదో తేదీనే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రూ.9 వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసాకే కేటాయించి పెట్టినట్లు సమాచారం. మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపుగా ముగిసిపోతుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్‌ ఎత్తేశాక రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల మిర్యాలగూడ బహిరంగ సభలో ఇదే విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి సంక్రాంతికే సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందనే చర్చ జరిగింది. అయితే నిధుల సర్దుబాటు, మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈనెలలో రెండో పక్షంలో రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా... లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది.


కొత్త రైతుల నమోదుకు అవకాశం

రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో కొత్త రైతుల నమోదు అంశం తెరపైకి వచ్చింది. గత వానాకాలంలో రైతుభరోసా పంపిణీ చేసిన తర్వాత.. జరిగిన భూముల క్రయవిక్రయాలు, కొత్త రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను యాసంగికి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే.. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు కొత్త రైతుల నమోదు, ధ్రువ పత్రాల స్వీకరణ చేపడతారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇక ఈ యాసంగి సీజన్‌కు కొత్త రైతుల నమోదు ఎప్పట్నుంచి ఉంటుంది? కటాఫ్‌ తేదీ ఎప్పటివరకు తీసుకుంటారు? అనేది చర్చనీయాంశంగా మారింది. నిరుడు యాసంగి రైతు భరోసా జనవరి 26న ప్రారంభించారు. అప్పుడు జనవరి ఒకటో తేదీని కటాఫ్‌ తేదీగా తీసుకున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జనవరి ఒకటో తేదీని కటా్‌ఫగా తీసుకుంటారా? లేకపోతే జనవరిలో జరిగిన భూముల క్రయవిక్రయాలను కూడా పరిగణనలోకి తీసుకోవటానికి ఈ నెల ఒకటో తేదీని కటా్‌ఫగా తీసుకుంటారా? అనే చర్చ వ్యవసాయ శాఖలో జరుగుతోంది.

శాటిలైట్‌ సర్వేతో సంబంధం లేకుండానే..

ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు నిర్వహించిన శాటిలైట్‌ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములను గత ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 1.46 కోట్ల ఎకరాలుగా గుర్తించి వాటికే రైతు భరోసా చెల్లించారు. ఇప్పుడు కూడా అదే లెక్కన చెల్లింపులు జరపనున్నారు. సాధారణంగా వానాకాలంలో పంటల సాగు పూర్తిస్థాయిలో చేస్తారు. యాసంగిలో సాగు విస్తీర్ణం దాదాపు సగానికి తగ్గుతుంది. అయినా కూడా వానాకాలం మాదిరే సుమారు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయనున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 05:11 AM