Share News

తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో గెస్ట్‌హౌస్‌లు

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:56 AM

రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తరహాలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో గెస్ట్‌హౌస్‌లు

  • హరే రామ.. హరే కృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్‌ విలువ మేరకు భూమి

  • మఠాలు, కుల సంఘాలకు భూ కేటాయింపునకు స్పష్టమైన విధానం

  • ఆలయ విస్తరణకు భూ సేకరణను వేగిరం చేయండి

  • తక్షణం నిధుల విడుదలకు చర్యలు తీసుకోండి

  • ఆలయ అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌/యాదాద్రి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తరహాలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి తిరుమలలో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి, అదే నమూనాను గుట్టలో అమలు చేయాలన్నారు. గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి ముందుకొచ్చినవారి జాబితాను రూపొందించి అర్హతల ఆధారంగా విడతల వారీగా అనుమతులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. గెస్ట్‌హౌస్‌ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, వాస్తు, పార్కింగ్‌, పర్యావరణం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌డీ బోధి పెవిలియన్‌లో రాష్ట్ర ఉన్నతాధికారులు, యాదగిరిగుట్ట ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూ కేటాయింపులు, పర్యాటక అభివృద్ధి, భూసేకరణ అంశాలపై సమీక్షించారు.


గుట్టలో సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ముందుకొచ్చిన హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్‌ ధరకు భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపుపై ఒక విధానం రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. అదే విధంగా కుల సంఘాలకు స్థలం కేటాయింపునకుగాను స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారు చేయాలన్నారు. ఎవరికైనా ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అయితే ఈ భూ కేటాయింపుల్లో పూర్తి భూ యాజమాన్య హక్కులు దేవస్థానానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఇక ఆలయ విస్తరణకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసేందుకు తక్షణమే నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ, ప్రైవేట్‌, భాగస్వామ్య విధానంలో యాదగిరిగుట్ట కేంద్రంగా సమగ్ర టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఆధునిక మౌలిక వసతులు, సౌకర్యాలు, అనుబంధ సేవలు మెరుగుపరచాలన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 06:58 AM